కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ మార్చి 20 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ మంత్రి విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని, మూడు బడ్జెట్లు పూర్తయినా ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని ఘాటుగా విమర్శించారు. పాత మొతి నగర్ కార్పొరేటర్ సిద్ధిఖీ నివాసం లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మూడో బడ్జెట్‌లో అయినా సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుందని ప్రజలు ఆశించారని, కానీ ఆ ఆశలను పూర్తిగా వమ్ము చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్‌లకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలు బడ్జెట్‌లో కనిపించలేదని ఆరోపించారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కేవలం 3.85 శాతం మాత్రమే కేటాయించడం దారుణమని, అందులోనూ రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు. బీసీ గురుకులాల్లో సరైన ఆహారం లేక విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతుల లోపంతో విద్యార్థులు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిలిపివేస్తున్నారని విమర్శించారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని పేర్కొంటూ, రైతు బంధు అమలు సరిగా లేదని, కరెంటు సరఫరా లోపాలు, యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు విస్తృతంగా అభివృద్ధి చెయ్యడంతో రాష్ట్ర సంపద పెరిగిందని, ప్రజల ఆస్తుల విలువలు పెరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగుతోందా లేదా వెనక్కి వెళ్లుతోందా అన్నది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీసీలకు రూ.50 వేల కోట్లు, దళితులకు రూ.10 లక్షల పథకానికి తగిన బడ్జెట్ కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక సమానత్వం ఇంకా అందలేదని అన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశగా నెడుతోందని, ఇది సంక్షేమ బడ్జెట్ కాదని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒత్తిడి తెచ్చి, అన్ని వర్గాలకు నిజమైన సంక్షేమ ఫలాలు అందించేలా బడ్జెట్ రూపకల్పన చేయించాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, కార్పొరేటర్లు సిద్ధికి, లక్ష్మి నరేష్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News