మహబూబ్ఓ నగర్ అక్టోబర్ 11 నుంచి ( కలం పవర్. న్యూస్ బ్యూరో )   దేశవ్యాప్తంగా ఓబీసీల హక్కుల  సాధనకు ఐక్య ఉద్యమాన్ని ఉధృతం చేయాలని జాతీయ ఓబీసీ సంఘాల సమాఖ్య నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 15న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఓబీసీలకు సమగ్ర కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జాతీయ ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓబీసీ స్ట్రాటజిక్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

కులగణనతోనే ఓబీసీలకు న్యాయం

   ఈ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో ఓబీసీలకు న్యాయమైన వాటా దక్కాలంటే సమగ్ర కులగణన అత్యంత అవసరమని స్పష్టం చేశారు. దేశంలో వివిధ కులాల జనాభాకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో ఉంటేనే రిజర్వేషన్ల అమలుకు పటిష్టమైన ప్రాతిపదిక ఏర్పడుతుందని అన్నారు. సరైన గణాంకాలు, తగిన ఆధారాలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓబీసీల జనాభా, సామాజిక పరిస్థితులు, విద్యా, ఉద్యోగ రంగాల్లో వారి ప్రాతినిధ్యంపై సమగ్ర సమాచారం సేకరించాలని డిమాండ్ చేశారు.

జనాభా ఎంత.. వాటా అంత!

     దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో ఓబీసీల్లోని ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి, పారదర్శకంగా కులగణన చేపట్టాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఓబీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, కాంట్రాక్టులు, పారిశ్రామిక రంగం, బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్న ఓబీసీలకు అవకాశాలు, వనరులు, నిర్ణయాత్మక వ్యవస్థల్లో తగిన స్థానం లభించేందుకు సమగ్ర విధానాలు అవసరమని పేర్కొన్నారు. కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఓబీసీలకు న్యాయం జరిగేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పార్టీలకు అతీతంగా ఐక్య పోరాటం

  మహారాష్ట్ర సీఎల్పీ నేత విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ సంఘాలు, నాయకులు ఐక్యమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఓబీసీల డిమాండ్ల సాధన కోసం నిర్వహించే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వాములను చేస్తామని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ మాట్లాడుతూ.. ఓబీసీ హక్కుల ఉద్యమంలో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సమావేశాలు.. హైదరాబాద్‌లోనూ సన్నాహాలు

   నవంబర్ 15న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని జాతీయ ఓబీసీ సంఘాల సమాఖ్య తీర్మానించింది. ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌లో కూడా సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణలోని ఓబీసీ సంఘాలను సమన్వయం చేయాలని నిర్ణయించింది. కులగణన, రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై తదుపరి కార్యాచరణను చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది.

జాతీయ స్థాయి నేతల హాజరు

   కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక అధ్యక్షుడు ఎడ్డురప్ప, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఆర్జేడీ కార్యదర్శి ధర్మేంద్ర కుష్వా, మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు బృజేంద్ర యాదవ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, కులగణనతో పాటు హక్కుల సాధన కోసం సమష్టిగా పోరాడాలనే సంకల్పాన్ని ఈ సమావేశం ప్రకటించింది.

ఓబీసీల హక్కుల కోసం సమరశంఖం!  నవంబర్ 15న చలో ఢిల్లీ.. జాతీయ ఓబీసీ సంఘాల సమాఖ్య కీలక తీర్మానం