మహబూబ్‌నగర్‌ అక్టోబర్ 21 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ): 

  రాజకీయాల్లో ప్రతి అడుగుకూ ఒక అర్థం ఉంటుంది.. ప్రతి నిరసన వెనుక ఒక ప్రశ్న ఉంటుంది.. మరికొన్ని సందర్భాల్లో ఒకరు వేసే అడుగు మరొకరికి రాజకీయంగా కలసివస్తుంది.! ఇప్పుడు మహబూబ్‌నగర్‌ రాజకీయాల్లో చలవగాలి రాఘవేంద్ర రాజు చేపట్టిన పాదయాత్ర చుట్టూ ఇలాంటి చర్చే మొదలైంది.

74- మహబూబ్ నగర్ నియోజక వర్గం ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, సంబంధిత ఆర్‌డీఓ వ్యవహారశైలిపై విమర్శలు, అధికారిని బదిలీ చేయాలనే డిమాండ్‌తో రాఘవేంద్ర రాజు మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్ నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. రెండు రోజులుగా సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కేవలం ఓటరు జాబితా అంశానికే పరిమితమవుతోందా.? లేక పాలమూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదికగా మారుతోందా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకరి పోరాటం.. మరొకరికి రాజకీయ అవకాశమా..?

   2014 ఫిబ్రవరి నెలలో ఫాం - 6 లేకుండా "దొడ్డిదారిన నమోదైన ఓటు" ప్రస్తుతం ఓ ప్రజా ప్రతినిధి కి సంబంధించిన "ఇల్లీగల్ ఎంట్రీ" అంశంపై "చిత్రగుప్తుడు పాపాలు లెక్కించినట్లు" రాఘవేంద్ర రాజు చేసిన ఫిర్యాదు, ఆర్‌డీఓపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుల ఓటరు నమోదుపై ఆరోపణలు చేస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు.

ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు రావడం ఒక విషయం.. ఆ ఆరోపణలు నిర్ధారణ కావడం మరో విషయం. విచారణలో వాస్తవాలు తేలకముందే పదవి పోతుందని అంచనా వేయడం తొందరపాటే. అయినప్పటికీ ఈ వివాదం రాజకీయ చర్చను పెంచితే, దాని ప్రభావం పాలమూరు రాజకీయాలపై పడే అవకాశం లేకపోలేదు.

"రాజకీయాల్లో ఒకరు గోతిని తవ్వితే మరొకరు అందులో పడతారో.. లేక పక్కనే ఉన్నవారు మెట్లు వేసుకొని పైకి ఎక్కుతారో కాలమే నిర్ణయిస్తుంది!"

ఆ ప్రజా ప్రతినిధి కి ఇబ్బంది వస్తే.. శ్రీనివాస్‌ గౌడ్‌కు కలిసొస్తుందా..?

    మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌ రాజకీయాల్లో కీలకమైన పేరుగా కొనసాగుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గానికి రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, స్థానిక పరిచయాలు, పార్టీ కార్యకలాపాలు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరోసారి చర్చకు వస్తున్నాయి. ఒకవేళ ప్రస్తుత ప్రజా ప్రతినిధి పై వచ్చిన ఆరోపణలు అధికారిక విచారణలో నిర్ధారణై, భవిష్యత్తులో ఏదైనా చట్టపరమైన లేదా రాజకీయ పరిణామం చోటుచేసుకుంటే.. దాని ప్రభావం నియోజకవర్గ రాజకీయాలపై ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

   అలాంటి పరిస్థితుల్లో "కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు" అనే విధంగా మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్‌ గౌడ్‌కు రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుందా..? తన రాజకీయ అనుభవాన్ని, ప్రజల్లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని మళ్లీ బలపడే అవకాశం ఉంటుందా? అన్నది ఆసక్తికరమైన చర్చే...చట్టపరమైన పరిణామాలు, ప్రజాభిప్రాయం, భవిష్యత్తు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

సొంత పార్టీ నేతపై తిరుగుబాటా.. లేక వ్యవస్థలో మార్పు కోసం పోరాటమా.?

     రాఘవేంద్ర రాజు కాంగ్రెస్‌ నాయకుడిగా ఉండి, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధికి సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చకు దారితీయవచ్చు. అయితే ఒకే పార్టీకి చెందిన నాయకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం మాత్రమే తిరుగుబాటుకు నిదర్శనం కాదు. ఆయన చేస్తున్నది నిజంగా ఓటరు జాబితా పారదర్శకత కోసం పోరాటమా.? అధికారుల పనితీరుపై నిరసనా..? లేక ఈ పరిణామానికి అంతర్గత రాజకీయ కోణం కూడా ఉందా..? "39 వాగ్దానాలకు మొండిచేయి చూపి నమ్మకద్రోహం చేసినందుకు ప్రతి చర్య" నా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఆయన ఉద్దేశాలపై ఊహాగానాలు కాకుండా, ఆయన ప్రకటనలు, ఫిర్యాదుల వివరాలు, తదుపరి చర్యలను పరిశీలించాలి. పొగ లేనిదే నిప్పు ఉండదని అంటారు. కానీ రాజకీయాల్లో పొగ కనిపించిందని నిప్పు ఉందని ముందే తీర్పు చెప్పలేం! అందుకే ఈ వ్యవహారంలో ఆరోపణలు, రాజకీయ విమర్శలు, నిర్ధారిత వాస్తవాలు.. ఈ మూడింటినీ వేరుగా చూడాల్సిన అవసరం ఉంది.

ఆర్‌డీఓ బదిలీ డిమాండ్‌.. అసలు పరిష్కారం ఏది..?

   సంబంధిత ఆర్‌డీఓ ఏకపక్షంగా వ్యవహరించారని, తాను ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని రాఘవేంద్ర రాజు ఆరోపిస్తున్నారు. ఆయనను బదిలీ చేసి కొత్త అధికారిని నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఒక అధికారిని బదిలీ చేయడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందా.? ఫిర్యాదులోని అంశాలను నిష్పాక్షికంగా పరిశీలించడం, ఓటరు జాబితాలను తనిఖీ చేయడం, తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిదిద్దడం, బాధ్యులపై ఆధారాలతో చట్టపరమైన చర్యలు తీసుకోవడమే అసలు పరిష్కారం. వ్యక్తులు మారితే సరిపోదు.. వ్యవస్థలో పారదర్శకత రావాలి. కుర్చీ మారితే కథ ముగియదు.. ఫిర్యాదుకు న్యాయం జరిగితేనే అసలు కథ పూర్తవుతుంది.!

పాలమూరు రాజకీయాల్లో ఎవరి అడుగు ఎటువైపు..?

   రాఘవేంద్ర రాజు పాదయాత్ర కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్‌ స్పందన ఎలా ఉంటుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. "ఆ ప్రజా ప్రతినిధి" కి సంబంధించిన ఆరోపణలపై అధికారిక విచారణ ఫలితం కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు రాజకీయంగా లాభపడతారు, ఎవరు నష్టపోతారు అనే చర్చకు ఇప్పుడే తుది తీర్పు ఇవ్వలేం. అయితే ఈ పరిణామం ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది: ఓటరు జాబితా వంటి కీలక అంశంపై వివాదం తలెత్తినప్పుడు "ప్రజా పాలన"లో అధికారుల నుంచి పారదర్శకమైన సమాధానం రావడం అత్యంత అవసరం. అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా ఆరోపణలను ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. రాఘవేంద్ర రాజు పాదయాత్ర వల్ల ఆ ప్రజా ప్రతినిధి పై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందా..? మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు పరోక్షంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయా..? లేక అధికారుల విచారణతో ఈ వివాదం ముగుస్తుందా..?

రాజకీయ చదరంగంలో పావులు కదులుతున్నాయి.. కానీ చివరి ఎత్తు ఎవరిదో...!

   పాలమూరు రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇదే — పాదయాత్ర చేస్తున్నది రాఘవేంద్ర రాజు.. రాజకీయంగా లాభపడేది ఎవరు..?

దీనికి సమాధానం నినాదాల్లో కాదు.. ఎన్నికల అధికారుల నిర్ణయాల్లో, పార్టీ రాజకీయ పరిణామాల్లో, ప్రజాస్వామ్య ప్రక్రియలో తేలాల్సి ఉంది.

రాఘవేంద్ర రాజు పాదయాత్రతో లాభపడేదెవరు.? - సొంత పార్టీ నేతపై రాజకీయ సమరశంఖమా.. ప్రత్యర్థికి పరోక్షంగా అవకాశాల బాటనా..?రాఘవేంద్ర రాజు పాదయాత్రతో లాభపడేదెవరు.? - సొంత పార్టీ నేతపై రాజకీయ సమరశంఖమా.. ప్రత్యర్థికి పరోక్షంగా అవకాశాల బాటనా..?