మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 6 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ): ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ.. పాలకులు, అధికార యంత్రాంగానికి ప్రజల గొంతుకగా నిలుస్తున్న జర్నలిస్టుల సొంతింటి కల మాత్రం ఇంకా నెరవేరడం లేదని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (TWJF) ఆవేదన వ్యక్తం చేసింది. జర్నలిస్టుల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలనే డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ముట్టడించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, జర్నలిస్టుల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం కొనసాగుతోందని ప్రశ్నించారు.

ప్రజల ఇళ్ల కోసం వార్తలు రాసే వారికి సొంతింటి పరిస్థితి ఏంటి?

  ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యలను ప్రతిరోజూ వార్తలుగా ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులే నేడు “మా కుటుంబానికి ఓ ఇల్లు ఎక్కడ?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఫెడరేషన్‌ నాయకులు అన్నారు.

అర్హత కలిగిన జర్నలిస్టులను గుర్తించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో వారికి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దరఖాస్తులు, అర్హతలు, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఫైళ్లలో కాదు.. క్షేత్రస్థాయిలో పరిష్కారం కావాలి

  జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై కేవలం హామీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫైళ్ల కదలికలతో సరిపెట్టకుండా అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అర్హులైన జర్నలిస్టుల వివరాలను పారదర్శకంగా పరిశీలించి, ఇళ్ల కేటాయింపుపై కాలపరిమితితో కూడిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

“ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన అధికారులు.. జర్నలిస్టుల సమస్యను కూడా అదే బాధ్యతతో చూడాలి. వార్తల్లో సమస్యను రాసే జర్నలిస్టు, చివరకు తన ఇంటి సమస్యను వార్తగా రాయించుకునే పరిస్థితి రాకూడదు” అని వారు స్పష్టం చేశారు.

ఇకనైనా స్పందించాలి..

 జర్నలిస్టుల డిమాండ్‌పై సంబంధిత రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించి అర్హులైన జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని ఫెడరేషన్‌ నాయకులు కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి దశలో మరింత ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిస్టుల గొంతు అధికారుల చెవులకు చేరిందా? లేక మరోసారి ఫైళ్ల దుమ్ములోనే ఈ డిమాండ్‌ మగ్గిపోతుందా? అన్నది ఇప్పుడు అధికారుల స్పందనపై ఆధారపడి ఉంది.