మహబూబ్‌నగర్ అక్టోబర్ 01 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ): 

     చరిత్రలో చిలకల గురించి రాశారు.. పావురాల గురించి రాశారు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే.. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచే శవాల కథ.. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ.. ఒక దగడ్‌ వొచ్చి మొత్తం జాతిలో జోష్‌ తెచ్చిండు. థూ అనిపించుకున్న కాకులు తల్వార్‌లు పట్టినాయ్‌.. ప్రజల కోసం రెక్కలు విప్పి తిరిగే కాకుల గూటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇది అలాంటి ఒక గూటి కథ.  ప్రజల కష్టాలను అక్షరాలుగా మలిచి అధికారుల తలుపులు తట్టే జర్నలిస్టుల జీవితాల్లోనే ఏళ్ల తరబడి ఒక ప్రశ్న వేలాడుతోంది.

“మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు..?”

    ప్రజల సమస్యలకు శీర్షికలు పెట్టే చేతులు.. ఇప్పుడు తమ సమస్యకు సమాధానం కోసం రోడ్డెక్కుతున్నాయి. మౌలాలి గుట్టలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో నిర్మించిన మౌలాలి గుట్టలోని జి+2 ఇళ్ల సముదాయం.. జర్నలిస్టుల ఆశలకు ప్రతీకగా నిలిచింది. జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపుపై ప్రక్రియ ముందుకు సాగిందని సంఘాలు చెబుతున్నాయి. కానీ కాలం గడిచింది. భవనాలు ఉన్నాయి...తలుపులు ఉన్నాయి... తాళాలు ఉన్నాయి... కానీ జర్నలిస్టు చేతిలో ఆ తాళంచెవి మాత్రం లేదు.!

ఇదే ఇప్పుడు పాలమూరు జర్నలిస్టుల గుండెల్లో మండుతున్న ప్రశ్న..!!  

       మూడేళ్లు గడిచాయి.. తాళాలు మాత్రం ఎందుకు తెరుచుకోలేదు.?  ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు కావాలి.. సిమెంట్ కావాలి.. ఇంజినీర్లు కావాలి.. కాంట్రాక్టర్లు కావాలి. కానీ ఒక ఇల్లు లబ్ధిదారుడికి ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి..? మౌలాలి గుట్టలో నిర్మించిన జి+2 ఇండ్ల విషయంలో ఇదే ప్రశ్న. నిర్మాణం పూర్తయిందా.? అయితే అప్పగింత ఎందుకు లేదు.? కేటాయింపు జరిగిందా.? అయితే పట్టాలు ఎందుకు లేవు.?  ప్లాట్లు కేటాయించారా.?  అయితే ఎన్వోసీలు ఎందుకు లేవు.? అర్హతలు పరిశీలించారా.?  అయితే తుది జాబితాపై స్పష్టత ఎందుకు లేదు.?

 ప్రశ్నలు ఎన్నో.. సమాధానాలు మాత్రం శూన్యం..?

       “తాళం వేసిన తలుపు తెరవడానికి తాళంచెవి సరిపోతుంది.. కానీ ఫైల్‌కు వేసిన తాళం తెరవడానికి ఎవరి సంతకం కావాలి.?” ఇండ్ల తాళాలు ఇవ్వన్నీయకుండా అడ్డుకుంటున్న ఆ "షికంజా మాలిక్" ఎవరు.? ఇదే ఇప్పుడు పాలమూరు జర్నలిస్టుల మధ్య వినిపిస్తున్న వ్యంగ్యమైన ప్రశ్న. ఇళ్లకు అడ్డుపడుతున్నది ఎవరు.?  ఒక అధికారి అయితే.. ఆ అధికారి ఎవరు.? ఒక ఫైల్ అయితే.. ఆ ఫైల్ ఎక్కడ ఆగింది.? ఒక నిబంధన అయితే.. ఆ నిబంధన ఏమిటి.? ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఆ అభ్యంతరం ఏమిటి.? ఎన్వోసీ సమస్య అయితే.. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది.? అసలు ఈ తాళం వెనుక ఉన్న ‘షికంజా మాలిక్’ ( ప్రజా ప్రతినిధి) ఎవరు.? ఇది ఆరోపణ కాదు. ఇది పాలమూరు జర్నలిస్టులు అధికార వ్యవస్థను అడుగుతున్న సూటి ప్రశ్న. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫైల్ ఆగొచ్చు.. కానీ సమాధానం ఆగకూడదు. 

18 రోజుల దీక్షలు.. కురిసిన హామీల వర్షం.!

      ఇళ్ల కోసం జర్నలిస్టులు 18 రోజుల పాటు రిలే దీక్షలు చేశారు. దీక్షా శిబిరానికి పదవులున్న లేని నాయకులు వచ్చారు. పదవులు సాధించారు. హామీలు ఇచ్చారు. నిమ్మరసం ఇచ్చారు. “త్వరలో ( నెల రోజుల్లో) సమస్య పరిష్కరిస్తాం” అన్నారు. ఆ మాటలు విన్న జర్నలిస్టులు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ హామీల వైపు చూస్తే.. నిమ్మరసం అయిపోయింది..  దీక్ష ముగిసింది.. నెలలు గడిచాయి.. సంవత్సరాలు గడిచాయి.. కానీ తాళంచెవి మాత్రం చేతికి రాలేదు.!  “మాట ఇచ్చి మరిచిపోవడం రాజకీయంలో సాధారణమైపోతే.. మాటను నమ్మినవాడి పరిస్థితి ఏమిటి.?” అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ప్యారడైజ్‌లో సవారీలు గుర్తింపు కోసం పోరాటం చేశారు.. పాలమూరులో గూటి కోసం జర్నలిస్ట్ లు పోరాటం చేస్తున్నారు.! ఆ సినిమాలో మనుషులు తమ గుర్తింపు కోసం పోరాడాల్సి వచ్చింది. పాలమూరులో మాత్రం ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే జర్నలిస్టులు తమ ఇంటి హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని జర్నలిస్ట్ సంఘల నాయకులు అంటున్నారు. అక్కడ గుర్తింపు కోసం పోరాటం అయితే.. ఇక్కడ “మా గూడు ఎక్కడ.?” అనే ప్రశ్న. అక్కడ మనిషి తన ఉనికి కోసం నిలబడితే.. ఇక్కడ జర్నలిస్టు తన కుటుంబానికి ఒక చిరునామా కోసం నిలబడుతున్నాడు. ఇది కేవలం ఇళ్ల పోరాటం కాదు..ఇది గుర్తింపు కోసం పోరాటం. ఇది హక్కు కోసం పోరాటం. ఇది హామీ అమలుకు పోరాటం.

పట్టాలు లేవు.. తాళాలు లేవు.. ఎన్వోసీలు లేవు.!

   పాలమూరు జర్నలిస్టుల ఇళ్ల సమస్యను ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇల్లు లేదు అనడం కాదు..ఇల్లు ఉన్నా హక్కు పత్రం లేదు.  ప్లాటు ఉన్నా ఎన్వోసీ లేదు. భవనం ఉన్నా తాళం లేదు. తాళం ఉన్నా తాళంచెవి లేదు. హామీ ఉంది.. అమలు లేదు.! అమలు చేసే మనసు లేదు..!

ఇంతకంటే విచిత్రమైన పరిపాలనా పజిల్ ఇంకేముంటుంది.?

     “అరచేతిలో వైకుంఠం చూపించి.. గడప దాటనివ్వకపోవడం” అన్న సామెత గుర్తుకొస్తోందని జర్నలిస్టులు అంటున్నారు. ప్రజల ఇళ్ల సమస్యపై వార్తలు రాసిన చేతులకే ఇప్పుడు గూడు కోసం వార్త రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ.. పేదల ఇళ్ల సమస్యపై వార్తలు. భూమి సమస్యపై వార్తలు. పట్టాల సమస్యపై వార్తలు. అక్రమ నిర్మాణాలపై వార్తలు. ప్రభుత్వ పథకాల అమలుపై వార్తలు. అధికారుల నిర్లక్ష్యంపై వార్తలు. ప్రజాప్రతినిధుల హామీలపై వార్తలు. ఇప్పుడు అదే జర్నలిస్టులు తమ జీవితాల్లోని సమస్యపై తామే వార్తగా మారాల్సి వచ్చింది. “ఇతరుల ఇళ్లకు చిరునామాలు వెతికిన జర్నలిస్టులు.. తమ ఇళ్లకు చిరునామా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం కాలం వేసిన పెద్ద పనిష్మెంట్ కాదా..?”

‘పాలమూరు టు ప్రజాభవన్’.. ఇక మాట కాదు, మహాపాదయాత్రే.!!

      ఇక వినతులు చాలాయి. దీక్షలు చాలాయి. హామీలు చాలాయి. ఎదురుచూపులు చాలాయి. అందుకే అక్టోబర్ 10న “పాలమూరు టు ప్రజాభవన్” పాదయాత్రకు జర్నలిస్టులు సిద్ధమవుతున్నారు. ఇది ఒక సాధారణ పాదయాత్ర కాదు. పాలమూరు నుంచి ప్రజాభవన్ వరకు నడిచేది కాళ్లు మాత్రమే కాదు..మూడేళ్ల నిరీక్షణ.18 రోజుల దీక్షల బాధ. ఇచ్చిన హామీల జ్ఞాపకం. తాళం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల ఆశ. వేసే ప్రతి అడుగు ఒక ప్రశ్న. “ఇల్లు ఎప్పుడు?” ప్రతి నినాదం ఒక డిమాండ్. “హామీ కాదు.. అమలు కావాలి!” ప్రతి అడుగు ప్రభుత్వానికి ఒక గుర్తు.  “జర్నలిస్టుల సమస్య కూడా ప్రజా సమస్యే!”

 ‘"పాలకులం కాదు సేవకులం’" అనే బ్యానర్‌కు.. తాళంచెవి అనే సమాధానం ఎప్పుడు..?

     బ్యానర్లపై “ప్రజల సేవకులం” అని రాయడం ప్రజాస్వామ్య రాజకీయాల్లో సాధారణమే. కానీ సేవకుడి అసలు పరీక్ష బ్యానర్‌పై కాదు.. బాధితుడి తలుపు ముందు ఉంటుంది. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించి తాళంచెవి చేతిలో పెట్టిన రోజే ఆ సేవకు అర్థం కనిపిస్తుందని జర్నలిస్ట్ సంఘ నాయకులు అంటున్నారు. బ్యానర్‌పై ‘సేవకులు’.. ఫైల్‌పై ‘పెండింగ్’..ఇదేనా సేవా వ్యవస్థ.? అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు.?

      మౌలాలి గుట్టలోని జి+2 ఇళ్ల ప్రస్తుత పరిస్థితి ఏమిటి.? ఎంతమంది జర్నలిస్టులకు కేటాయింపు జరిగింది.? కేటాయింపుల ప్రక్రియ ఏ దశలో ఉంది.? పట్టాలు ఎందుకు ఇవ్వలేదు.? ఎన్వోసీలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.? తాళాలు ఎందుకు పంపిణీ కాలేదు.? ఏ శాఖ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది.? ఏదైనా న్యాయపరమైన, పరిపాలనా లేదా సాంకేతిక అడ్డంకి ఉంటే అది ఏమిటి.? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు తేదీలతో, ఫైళ్లతో, ఉత్తర్వులతో సమాధానం చెప్పాలి. ఎందుకంటే.. “ఊరంతా తెలిసిన విషయం.. అధికార కార్యాలయంలో మాత్రం ఫైల్ రహస్యంగా ఉండకూడదు.”

ఇక తాళం తెరుచుకోవాల్సిందే.!

   పాలమూరు జర్నలిస్టుల పోరాటం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు.? 18 రోజుల దీక్షలకు ఫలితం ఎప్పుడు.? హామీలకు కార్యరూపం ఎప్పుడు.? పట్టాలకు తేదీ ఎప్పుడు.?ఎన్వోసీలకు పరిష్కారం ఎప్పుడు? ఇళ్లకు తాళాలు ఎప్పుడు.? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పాలమూరు నుంచి ప్రజాభవన్ వైపు జర్నలిస్టుల అడుగులు పడుతున్నాయి. “గూటి కోసం కాకి కూస్తే అది అరుపు కావచ్చు.. హక్కు కోసం జర్నలిస్టు కూస్తే అది ప్రజాస్వామ్య స్వరం.” ఆ స్వరం ఇప్పుడు పాలమూరు గల్లీలను దాటి ప్రజాభవన్ గడపకు చేరబోతోంది. తాళాలు తెరవాల్సింది ఇళ్లకే కాదు.. ఏళ్లుగా మూసుకుపోయిన ఫైళ్లకూ! హామీలు చెప్పాల్సింది కాదు..అమలు చేయాల్సిన సమయం వచ్చింది.! పాలమూరు టు ప్రజాభవన్ — ఇది కేవలం పాదయాత్ర కాదు..జర్నలిస్టుల గూటి కోసం సాగుతున్న హక్కుల ప్రయాణం.

జర్నలిస్టుల ఇండ్లకు అడ్డంగా నిలిచిన ‘షికంజా మాలిక్’ ఎవరు..?